మరణశిక్షపై మొదటిసారి స్పందించిన షేక్ హసీనా : ఇది రాజకీయ కుట్ర
- అవామీ లీగ్‌ను బలహీనపర్చే ప్రయత్నమని ఆరోపణ
- హేగ్ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో విచారణకు సిద్ధమంటూ సవాల్
- తాత్కాలిక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
ఢాకా, నవంబర్ 17 :
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనాపై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ విధించిన మరణశిక్షపై ఆమె తొలిసారిగా ఘాటుగా స్పందించారు. గతేడాది జూలైలో జరిగిన ఆందోళనల సందర్భంగా మానవతా వ్యతిరేక నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఈ తీర్పు వెలువడగా, హసీనా దీనిని పూర్తిగా పక్షపాతంతో కూడిన, రాజకీయ ప్రేరేపిత కుట్రగా అభివర్ణించారు. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసిన “రిగ్డ్ ట్రిబ్యునల్” ఈ తీర్పు ఇచ్చిందని హసీనా ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాని ప్రభుత్వం, తనను మరియు అవామీ లీగ్‌ను రాజకీయంగా అంతం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కుట్ర పన్నిందని ఆరోపిస్తూ, ఐఏఎన్ఎస్ వెల్లడించిన వివరాలను ఆమె ప్రస్తావించారు. యూనస్ పరిపాలనలో దేశ ప్రజా సేవలు దెబ్బతిన్నాయని, శాంతిభద్రతలు కుప్పకూలాయని ఆమె తీవ్రంగా విమర్శించారు. గత ఏడాది జరిగిన ఆందోళనల్లో ఇరువర్గాల మరణాలపై తాను విచారం వ్యక్తం చేస్తున్నానని, కానీ నిరసనకారులపై కాల్పులు జరపమని తాను లేదా తన పార్టీ నేతలు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని హసీనా స్పష్టం చేశారు. తనపై మోపిన ఆరోపణలన్ని తాను చట్టపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని, నిజాయతీగా నడిచే న్యాయస్థానంలో తాను నిర్దోషిగా బయటపడతానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కేసును హేగ్‌లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు విచారించాలనే సవాల్‌ను హసీనా విసురుతూ, ఐసీసీ విచారణ జరిగితే తాత్కాలిక ప్రభుత్వమే మానవ హక్కుల ఉల్లంఘనలకు బాధ్యత వహించాల్సి వస్తుందని ఆమె ఆరోపించారు. అందుకే ఈ సవాల్‌ను ప్రభుత్వం స్వీకరించడానికి ముందుకు రావడం లేదని హసీనా విమర్శించారు. ఈ తీర్పుతో బంగ్లాదేశ్ రాజకీయాలు మరోసారి ఉద్రిక్తంగా మారాయి.