Banner
Watermark
సౌదీలో హైదరాబాద్ యాత్రికుల ఘోర రోడ్డు ప్రమాదం
📅 17 November 2025 ✍️ REPUBLIC HINDUSTAN
News Image

- 46 మందిలో ఒక్కడే బతికాడు… సౌదీ బస్ ప్రమాదంలో విషాదం
- డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో బస్సు అగ్నికీలల్లో దగ్ధం
- 45 మంది యాత్రికుల మృతి—అబ్దుల్ షోయబ్ మాత్రమే ప్రాణాలతో బయటపాటు
- సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- కంట్రోల్ రూమ్ నంబర్లు: +91 79979 59754, +91 99129 19545

హైదరాబాద్, 17 :
సౌదీ అరేబియాలో మదీనాకు సమీపంగా హైదరాబాద్ యాత్రికులతో వెళ్తున్న బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. మక్కా నుంచి బయల్దేరిన ఈ బస్సును డీజిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు నిమిషాల్లోనే అగ్నికీలల్లో చిక్కుకుంది. బస్సులో మొత్తం 46 మంది ప్రయాణికులు ఉండగా, వారిలో 45 మంది మంటల్లో కాలిపోయి మృతి చెందారు. ప్రమాద తీవ్రత అంత ఎక్కువగా ఉండటంతో రక్షణ చర్యలకు కూడా అవకాశం లేకుండా పోయింది. సంఘటన జరిగిన ప్రాంతంలో భారీ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ భయంకర ప్రమాదం నుంచి ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు హైదరాబాద్‌కు చెందిన 24 ఏళ్ల మొహమ్మద్ అబ్దుల్ షోయబ్‌. అతను డ్రైవర్ పక్కన కూర్చోవడంతో మంటలు వ్యాపించేలోపే బయటపడగలిగాడని అధికారులు వెల్లడించారు. తీవ్ర గాయాలతో బాధపడుతున్న షోయబ్‌ను స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు అందలేకపోయినా, ఈ ప్రమాదంలో షోయబ్ కుటుంబ సభ్యులందరూ మృతి చెందినట్టు సమాచారం రావడం మరింత దుర్ఘటనాత్మక వాతావరణాన్ని సృష్టించింది. మృతులందరూ హైదరాబాద్‌కు చెందిన వారేనని విదేశాంగ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. నవంబర్ 9న జెడ్డాకు బయల్దేరిన 54 మంది హైదరాబాద్ యాత్రికుల బృందం ఈ నెల 23 వరకు మక్కా–మదీనా యాత్ర కొనసాగించాలని ప్లాన్ చేసుకుంది. వారిలో నలుగురు ముందుగా కారులో మదీనాకు వెళ్లగా, మరో నలుగురు మక్కాలోనే నిలిచిపోయారు. మిగిలిన 46 మంది ప్రత్యేక బస్సులో మదీనాకు బయల్దేరారు. మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో బస్సు వేగంగా వెళ్తుండగా వ్యతిరేక దిశ నుంచి వచ్చిన డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో బస్సు దగ్ధమై పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో చిక్కుకుని 45 మంది యాత్రికులు బయటపడే అవకాశం లేకుండా పోయిందని స్థానిక అధికారులు వివరించారు. ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. విదేశాంగ శాఖ, సౌదీ ఎంబసీతో సమన్వయం చేసి తక్షణ సహాయక చర్యలను ప్రారంభించేందుకు సీఎం ఆదేశించారు. దాంతో ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు ఢిల్లీలో ఉన్న కో-ఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్‌తో మాట్లాడి అవసరమైన సూచనలు చేశారు. అదేవిధంగా కుటుంబ సభ్యులకు సమాచారాన్ని చేరవేయడానికి సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
🏠 Home