Banner
Watermark
విజయవాడ శివారులో చిక్కిన 28 మంది మావోయిస్టులు
📅 18 November 2025 ✍️ REPUBLIC HINDUSTAN
News Image
- కేంద్ర కమిటీ కమాండర్ జ్యోతి అరెస్ట్

దేవ్ జి, హిడ్మా రక్షణ దళ సభ్యులు
విచారణకు గోండు భాష అడ్డంకి
ఆటోనగర్ షెల్టర్ జోన్‌లో అరెస్ట్

అమరావతి, నవంబర్ 18 :
విజయవాడ నగర శివారు న్యూ ఆటోనగర్‌లో పోలీసులకు చిక్కిన 28 మందిలో మావోయిస్ట్ పార్టీకి చెందిన కీలక సభ్యులు ఉన్నట్లు స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) అధికారులు గుర్తించారు. వీరి అరెస్ట్‌తో మావోయిస్టుల కార్యకలాపాలపై కీలక సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. వీరిలో ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్ జికి రక్షణగా ఉన్న 9 మంది సుశిక్షితులైన కమాండోలు ఉన్నారని అధికారులు కనుగొన్నారు. ఈ గ్రూప్‌లో దేవ్ జికి రక్షణ దళం కమాండర్ జ్యోతి సైతం విజయవాడ షెల్టర్ జోన్‌లో దొరికిన వారిలో ఒకరని అధికారులు వెల్లడించారు. ఈ అరెస్ట్‌లు మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకత్వానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న మిగతా 19 మంది మావోయిస్టులు.. కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాకు రక్షణగా ఉన్న ప్లాటూన్ సభ్యులని ఎస్ఐబీ అధికారులు తెలిపారు. చిక్కిన ఈ 28 మంది సభ్యులు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు పార్టీ వారని అధికారులు పేర్కొన్నారు. విజయవాడ నగర శివారు న్యూ ఆటోనగర్‌లోని ఆటోమొబైల్ పరిశ్రమలో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు పనిచేస్తున్న నేపథ్యంలో, వీరంతా వారితో కలిసిపోయి ఇక్కడ తలదాచుకుంటున్నట్లు ఎస్ఐబీ అధికారుల విచారణలో చెప్పినట్లు సమాచారం. ఈ విధంగా నగర శివారు ప్రాంతాలను షెల్టర్ జోన్‌లుగా ఉపయోగించుకోవడంపై అధికారులు దృష్టి సారించారు. ఈ మావోయిస్టులకు గోండు భాషతో పాటు కొంతమందికి కొద్దిగా హిందీ మాత్రమే తెలుసునని అధికారులు వివరించారు. ఈ భాషా పరిమితి కారణంగా విచారణకు తీవ్ర ఇబ్బందిగా మారిందని వారు చెబుతున్నారు. తొలుత వీరంతా తమకేమీ తెలియదని ఎస్‌ఐబీ అధికారులకు చెప్పినప్పటికీ, విచారణ క్రమంలో కొన్ని కీలక విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. గోండు భాషతో పాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో మాట్లాడే భాష తెలిసి, వాటిని తెలుగులోకి అనువదించే ట్రాన్స్‌లేటర్ల కోసం పోలీస్ అధికారులు ప్రస్తుతం ముమ్మరంగా అన్వేషణ చేస్తున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్ జి, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా వంటి అగ్రనేతల రక్షణ దళాలకు చెందిన కీలక సభ్యులు విజయవాడ వంటి నగర శివారులో పట్టుబడటం భద్రతా సంస్థలను ఆశ్చర్యపరిచింది. నక్సల్స్ తమ కార్యకలాపాలను నగరాలు, పట్టణాలకు విస్తరిస్తున్నారనే అనుమానాలకు ఈ అరెస్ట్‌లు బలం చేకూరుస్తున్నాయి. ముఖ్యంగా కమాండర్ జ్యోతి అదుపులోకి రావడం ద్వారా మావోయిస్టుల వ్యూహాలు, నాయకత్వానికి సంబంధించిన సమాచారం లభించే అవకాశం ఉంది. మొత్తంగా, విజయవాడలో పట్టుబడిన ఈ 28 మంది మావోయిస్టుల విచారణ కీలక ఘట్టంగా మారనుంది. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ నుంచి వచ్చిన వీరు ఆంధ్రప్రదేశ్‌లో ఏయే కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు, వీరికి స్థానికంగా ఎవరి సహకారం ఉంది, నిధుల మళ్లింపు ఎలా జరుగుతోంది వంటి విషయాలపై ఎస్‌ఐబీ అధికారులు దృష్టి సారించారు. గోండు భాష మాట్లాడే అనువాదకులు దొరికిన తర్వాత విచారణ వేగవంతమై, మావోయిస్టుల నెట్‌వర్క్ గుట్టు రట్టు అయ్యే అవకాశం ఉంది.
🏠 Home