• Other News
  • Live TV
  • ‘అమృతం’కి 24 ఏండ్లు…

    ‘అమృతం’కి 24 ఏండ్లు…

    -తెలుగు టీవీని మార్చిన హాస్య జ్ఞాపకాల సందడి నెట్టింట

    హైదరాబాద్‌, నవంబర్‌ 19 : తెలుగు టెలివిజన్‌ ప్రపంచంలో కొత్త అధ్యాయాన్ని రాసి, సిట్‌కామ్‌లకు కొత్త నిర్వచనం ఇచ్చిన ‘అమృతం’ ప్రసారం ప్రారంభమై నేటితో సరిగ్గా 24 ఏండ్లు పూర్తయ్యాయి. దేశీయ టీవీ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన హాస్య ధారావాహికలలో ఒకటైన ఈ సీరియల్‌ ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచి ఉండడం విశేషం. ఈ సందర్భంగా నేడు సోషల్‌ మీడియా అంతా ‘అమృతం’ జ్ఞాపకాలను తలుచుకుంటూ అభిమానుల పోస్టులతో కిక్కిరిసిపోయింది.

    2001 నవంబర్‌ 18న జెమిని టీవీపై తొలి ఎపిసోడ్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన ‘అమృతం’ 2007 నవంబర్‌ 18 వరకు ఆరు సంవ‌త్స‌రాల‌పాటు అభ్యంతరంలేకుండా ప్రసారమైంది. మొత్తం 313 ఎపిసోడ్‌లు ప్రసారమైన ఈ సిట్‌కామ్‌ ప్రతివారం కుటుంబ సభ్యులందరినీ టీవీ ముందుకు కూర్చోబెట్టి కడుపుబ్బ నవ్వించిన హాస్యరాజ్యాన్ని నెలకొల్పింది. ముఖ్యంగా మధ్యతరగతి జీవితం, దానిలోని చిన్న చిన్న ఇబ్బందులు, అప్పు – ఆదాయాల మధ్య సతమతమయ్యే రోజువారీ సన్నివేశాలు అన్నీ హాస్యం ముసుగులో అద్దం పట్టడం ఈ సీరియల్‌ ప్రత్యేకత.

    ఈ ధారావాహికకు సృజనశీలుడైన గుణ్ణం గంగరాజు కథ, రచన, నిర్మాణ బాధ్యతలు చేపట్టి తెలుగు ప్రేక్షకులకు వెరైటీ హాస్యాన్ని అందించారు. కాలక్రమేణా అమృతం పాత్రలో శివాజీ రాజా, అనంతరం నరేష్‌, దాని తరువాత హర్షవర్ధన్ నటించి గుర్తింపు పొందారు. అంజి పాత్రలో గుండు హనుమంతురావు ఆహ్లాదకరమైన హాస్యాన్ని పంచగా… స‌ర్వం పాత్ర‌లో వాసు ఇంటూరి తన ప్రత్యేక శైలి హావభావాలతో నవ్వులు పంచాడు. అప్పాజీ పాత్రలో శివన్నారాయణ నరిపెద్ది మరపురాని నటన కనబరిచి ధారావాహికకు మరింత ప్రాణం పోశాడు.

    ‘అమృతం’ ఎపిసోడ్‌లు నేటికీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విపరీతమైన వీక్షణలు సాధిస్తున్నాయి. అప్పట్లో చిన్న బడ్జెట్‌తో రూపొందించిన ఈ సిట్‌కామ్‌ తన కథ, పాత్రలు, పాత్రల మధ్య కెమిస్ట్రీ, హాస్య టైమింగ్‌తో తెలుగు కుటుంబాల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అదే కారణంగా నేడు కూడా ఈ సీరియల్‌ జ్ఞాపకాలు సోషల్‌ మీడియాలో పునర్జీవం పొందుతూ, “మళ్లీ ఇలాంటి సీరియల్ వస్తే బాగుంటుంది” అని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

    📰 e-Paper Clip