- జూదంలో ఓడి ఎనిమిది మందితో అత్యాచారం చేయించిన ఘోరం
- కట్నం వేధింపులు–బలవంతపు గర్భస్రావం ఆరోపణలు
- బాగ్‌పత్‌లో మహిళ ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు ప్రారంభం
బాగ్‌పత్, 17 నవంబర్ :
ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలో భార్య జీవితం నరకయాతనగా మారిపోయిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జూదానికి బానిసైన భర్త, తన భార్యను పేకాటలో తాకట్టుపెట్టి దారుణాలకు ఒడిగట్టినట్లు బాధితురాలు పోలీసుల వద్ద ఫిర్యాదు చేసింది. గత ఏడాది అక్టోబర్‌లో మీరట్ జిల్లా ఖివాయ్ గ్రామానికి చెందిన డానిష్‌ను వివాహం చేసుకున్న ఈ మహిళ, పెళ్లి అనంతరం కుటుంబ సభ్యుల చేతుల్లో తీవ్రమైన హింసను ఎదుర్కొందని వాపోయింది. వివాహం జరిగిన కొద్దికాలానికే భర్త, అత్తమామలు కట్నం పేరుతో హింసకు పాల్పడినట్లు ఆమె తెలిపింది. ప్రతిరోజూ మద్యం మత్తులో ఇంటికి వచ్చి దాడులు చేయడం, కట్నం తీసుకురావాలని ఒత్తిడి చేయడం, చివరికి పేకాటలో తనను తాకట్టు పెట్టడం వంటి దారుణ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
జూదంలో ఓడిపోయిన తర్వాత తనను ఇతరులతో బెడ్ షేర్ చేయాలని భర్త బలవంతం చేశాడని బాధితురాలు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉమేష్ గుప్తా, మోను, అన్షుల్ సహా ఎనిమిది మంది తనపై అత్యాచారం చేసినట్లు ఆమె ఫిర్యాదులో వివరించింది. అంతేకాదు, ఆమె మరిది, వదిన భర్త, మామ అయిన యామీన్ కూడా దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది. కట్నం తీసుకురాకపోవడంతో తమ మాట వినాలని, ‘సంతోషపెట్టాలని’ కుటుంబసభ్యులు ఒత్తిడి పెట్టారంటూ ఆమె తీవ్ర వేదన వ్యక్తం చేసింది. “నేను గర్భవతి అని చెప్పినప్పుడు బలవంతంగా గర్భస్రావం చేశారు. నా కాలు మీద యాసిడ్ పోశారు. నదిలోకి తోసి చంపేందుకు ప్రయత్నించారు. కొందరు స్థానికులు ఉండటంతో నేను ప్రాణాలతో బయటపడ్డాను.
ఇప్పుడు కేసు ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారు” అని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిపై జరిగిన హింసాత్మక చర్యలన్నింటినీ విచారించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.